రివర్స్ ఆస్మాసిస్ ఫ్యూరిఫైయర్లపై ఈ ఏడాది చివరిలోగా నిషేధం విధించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు.. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. లీటరు నీటిలో 500 మిల్లీగ్రాముల కన్నా తక్కువ టీడీఎస్(టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్) ఉండే ప్రాంతాల్లో ఆర్వోలను బ్యాన్ చేయాలని ఎన్జీటీ కోరింది. నీటి నాణ్యతను తగ్గించే ఆర్వోలను ఆపేయాలన్నది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఈ నిషేధ ఆజ్ఞలపై కేంద్ర పర్యావరణ శాఖకు మరింత సమాయాన్ని ఎన్జీటీ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆశిస్తున్నట్లు బెంచ్ అభిప్రాయపడింది.
ఆర్వోల వినియోగాన్ని నియంత్రించాలని గతంలోనే ఎన్జీటీ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఎక్కడైతే లీటరు నీటిలో టీడీఎస్ 500 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉంటేందో.. ఆ ప్రాంతాల్లో ఆర్వోలను వాడరాదు అని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలను జారీ చేసింది. అలాంటి ప్రాంతాల్లో ఆర్వో శుద్దీకరణ యంత్రాలను వాడడం వల్ల నీటిలో నాణ్యత తగ్గిపోతుందని ఎన్జీటీ చెప్పింది. ఎక్కడైతే దేశంలో ఆర్వోలకు అనుమతి ఇచ్చారు, అక్కడ 60 శాతం నీటిని కచ్చితంగా రికవర్ చేయాలని కూడా తన ఆదేశాల్లో ఎన్జీటీ స్పష్టం చేసింది. రసాయనిక, సేంద్రియ లవణాలు, ఇతర ఖనిజాలు టీడీఎస్ నీటిలో ఉంటాయి. డబ్ల్యూహెచ్వో ప్రకారం.. లీటరు నీటిలో 300 గ్రాముల టీడీఎస్ స్థాయి ఉంటే ఆ నీరును ఉత్తమంగా భావించవచ్చు.