జూరాల నుంచి శ్రీశైలానికి చేరిన వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.  వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆల్మట్టి, నారాయణ్‌ పూర్‌ ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. మరోవైపు జూరాల ఒడి నింపిన కృష్ణమ్మ శ్రీశైలేషుని  చెంతకు చేరింది. గతేడాదితో పోలిస్తే శ్రీశైలం  ప్రాజెక్టుకు రెండు వారాల ముందుగానే ప్రవాహం  మొదలైంది. దీంతో దిగువన నాగార్జునసాగర్‌  ప్రాజెక్టు ఆయకట్టులో ఆశలు చిగురిస్తున్నాయి. అక్టోబర్‌ వరకు వరద ప్రవాహం కొనసాగను న్నందున ఎడమ కాల్వ పరిధిలోని దాదాపు  11లక్షల ఎకరాలకు సాగునీటికి ఢోకా లేనట్లే. ఆశాజనక పరిస్థితుల నేపథ్యంలో  రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం…

జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లతో పాటు పవర్‌ హౌస్‌ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు 73,879క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా నీటిమట్టం 24గంటల్లో ఒక అడుగు మేర పెరిగింది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు బుధవారం 530అడుగులు (167.9514 టీఎంసీలు) ఉంది. 500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా అంతే మొత్తంలో ఎస్‌ఎల్‌బీసీకి విడుదల చేస్తున్నారు.