ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృత పరుస్తాం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ ని మరో ఆరు జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాను ఫైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసి అమలు చేశామని అన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తరించినట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2,200 రకాల రోగాలకు వైద్య చికిత్సలు అందించనున్నామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాకు విస్తరిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించిన ఆస్పత్రులకు బకాయిలన్నింటిని చెల్లించామని జగన్‌ తెలిపారు.

ఇప్పటివరకు 11 టీచింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. మరో కొత్తగా 16టీచింగ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు.