తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన 262 మం ది జర్నలిస్టులకు రూ. 44.7 లక్షల ఆర్థికసాయం అందించినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు గురువారం పరీక్షలు నిర్వహించగా.. 36 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో ఐదుగురిని హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచించారని తెలిపారు. వీరందరికి రూ.7.7 లక్షల ఆర్థికసాయాన్ని వారి ఖాతాల్లో జమచేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన 185 మంది జర్నలిస్టులకు రూ. 37 లక్షలు, హోంక్వారంటైన్‌లో ఉన్న 77 మంది జర్నలిస్టులకు రూ. 7.7 లక్షలు, అందరికి కలిపి మొత్తం రూ.44.7 లక్షల ఆర్థికసాయం చేసినట్టు వెల్లడించారు. కరోనా బారినపడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
