జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం: సీఎం కేసీఆర్‌

★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు,
డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం

★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం , పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వ నిర్ణయం

★ జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనం మంజూరు

★ జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలి

ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మద్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సిఎం వెల్లడించారు.

జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. వారిని అభినందించారు. కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సిఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు.

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రదర్శించిన సేవా నిరతిని కొనియాడారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న బాటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలతో గార్డెన్ అభివృద్ధి చేసే కార్యాచరణ రూపొందించాలని సిఎం ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్య బహుకరించారు.