పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో సతీమణి సునీత రెడ్డి, కుమారుడు వేమన్ రెడ్డి కుతురు లహరిలతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనలను రక్షిస్తుందన్న హితోక్తి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ప్రతి వేడుక గుర్తుండి పోయేలా ఒక మొక్కను నాటాలని ఆయన సూచించారు. భవిష్యత్ తరాలకు మీరిచ్చే భరోసా మొక్కలు నాటడమేనని మంత్రి పేర్కొన్నారు.
