టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కడియంతో పాటు ఆయన ఇద్దరు గన్‌మెన్లకు, పీఏ, డ్రైవర్‌కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నటి వరకు హోం ఐసోలేషన్‌లో ఉన్న శ్రీహరికి.. మంగళవారం సాయంత్రం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో కడియం శ్రీహరి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందనున్నారు.
రెండు రోజుల క్రితం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్, పనిమనిషికి కూడా కరోనా సోకింది. పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. వారంతా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 47,705 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 429కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 1430 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 703 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో ఏడుగురు చనిపోయారు.