ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని గవర్నర్‌ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా తిరిగి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియమించాలని రాష్ట్రగవర్నర్‌ బిశ్వ భూషణ్‌  రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ లేఖ రాశారు. హైకోర్టు తీర్పు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని లేఖలో ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తొలగిస్తూ కొన్ని నెలల క్రితం ఏపీ సర్కార్‌ జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా  తిరిగి నియమించాలని ఆదేశాలు జారీచేసింది.

ఈ విషయంలో హైకోర్టు తీర్పుపై  ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి విన్నవించాలని సూచించింది. దీంతో మంగళవారం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ను కలిసారు. స్పందించిన గవర్నర్‌ బుధవారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని లేఖలో ఆదేశించారు.