ఆరోగ్య ఆస‌రా కింద 5వేల రూపాయ‌ల సాయం : సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

భ‌విష్య‌త్తులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన సీఎం..ప్ర‌స‌వం అయిన మ‌హిళ‌ల‌కు ఆరోగ్య ఆస‌రా కింద ఐదువేల రూపాయ‌లు అందించాల‌ని సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించాల‌ని అధికారులను ఆదేశించారు. అంగ‌న్‌వాడీల‌ను  సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల‌ని పేర్కొన్నారు. 

గ‌ర్భ‌వ‌తులు, బాలింత‌లు స‌హా 36 నెల‌లోపున్న శిశువుల‌ను ఒక విధంగా, 36 నుంచి 72నెల‌ల వ‌ర‌కున్న చిన్నారులను మ‌రో విధంగా చూడాల్సి ఉంటుంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. అంగ‌న్‌వాడీలోని పిల్ల‌ల‌కు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, స‌హా ప్ర‌త్యేక పుస్త‌కాల‌ను అందించాల‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగ‌న్‌వాడీల్లో ఆహారం ఎక్క‌డ తిన్నా ఒకే నాణ్య‌త ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ -2లపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని , దీనిపై స‌మ‌గ్రంగా ఆలోచించి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. సిల‌బ‌స్‌పైనా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు.