తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారిన ‘పవర్ స్టార్’ సినిమాపై ఊహించినట్లుగానే ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఆఫీసుపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనాకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన కార్యాలయంపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ రాంగోపాల్‌వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని రాంగోపాల్ వర్మ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో గొడవకు దిగారు. సెక్యూరిటీ గార్డులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రావడం, ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తూ ఆర్జీవీ ”పవర్ స్టార్” పేరుతో సినిమాను రూపొందించారు. ఇటీవలే సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయడం తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్ విడుదల కాగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు దాడికి దిగినట్లుగా కనిపిస్తున్నది.