బడుగు, బలహీన వర్గాల ఉద్యమనేత సాంబశివరావు అలియాస్ ఉసా కన్నుమూశారు. రెండు రోజులక్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన సాంబశివరావుకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స నిమిత్తం నగరంలోని బర్కత్‌పురాలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఊసా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర సమన్వయకర్తగా సాంబశివరావు ఉన్నారు. బీసీల సమస్యలపై దశాబ్దాలుగా పోరాటం చేశారు. బహుజనులు, ఎస్సీల కోసం అనేక ఉద్యమాలు చేపట్టారు. విప్లవ, ఎస్సీ, సామాజిక ఉద్యమాల సమన్వయ సాధనకు కృషి చేశారు. ఎస్సీ బహుజన మేధావిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా, ఉద్యమాల సారథి మరణం తెలుగు సమాజానికి తీరని లోటని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.