హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆందోళన వ్యక్తంచేశారు. నీటిలో అమ్మోనియం స్థాయి పెరిగిందన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘హర్యానా నుంచి కలుషిత నీరు విడుదల అవుతోంది. పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడం వల్ల నీటిలో అమ్మోనియాస్థాయి పెరిగింది. నీటిలో అమ్మోనియా సాంద్రత 0.8 పీపీఎం ఉండాలి. కానీ ప్రస్తుతం 2 పీపీఎం ఉంది. ఇది ఢిల్లీలోని నీటి శుద్ధి కర్మాగారాలను ప్రభావితం చేసింది. దీంతో నీటి సరఫరా 25 శాతం తగ్గింది.’ అని జైన్ వివరించారు. కాగా, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేయమని, వాటి సామర్థ్యం కొద్దిగా తగ్గిందన్నారు. నీటిలో అమ్మోనియా స్థాయి కొంతమేర తగ్గించవచ్చని చెప్పారు. హర్యానా, బాద్‌షాపూర్ కాలువ నుంచి విడుదలయ్యే నీటి నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు యమునా నదిలో పెరుగుతున్న కాలుష్యానికి కారణమని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన యమునా మానిటరింగ్ కమిటీ (వైఎంసీ) నదిలో ఆకస్మికంగా నురుగు పెరగడానికి గల కారణాల గురించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, పరిశ్రమల కమిషనర్ నుంచి నివేదిక కోరింది.