కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో స్కూళ్లల్లో నాడు-నేడు, వ్యవసాయం, రాష్ట్రంలో కరోనా పరిస్థితి తదితర వాటిపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తికావాలని ఆదేశించారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు తీసుకొచ్చిన సాగు ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.
పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 155251ను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.రాబోయే రోజుల్లో మహిళల పేరుపై 30లక్షల పట్టాలు ఇవ్వనున్నామని, పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇసుకను అందించాలని, అవకాశం ఉన్న చోట ఇసుకను తవ్వి నిల్వ చేయాలని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల నిర్మాణ కోసం స్థలాలను గుర్తించాలని సూచించారు.