గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎం.జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు నియమితులయ్యారు. వారిద్దరినీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా, ఎం.జకియా ఖానమ్‌ వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళ. డాక్టర్‌ పండుల రవీంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ. ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలకు మైనారిటీ, బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వీరిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ ఇటీవల గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే.