భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు శంకర్‌రెడ్డి, శివకుమార్ ఈ విచారణలో పాల్గొన్నారు. బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఈనెల 10వ తేదీన సీఐ శంకరయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు పలు ప్రదేశాల్లో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. దీంతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ ఎస్పీ సూర్యనారాయణ ఆదేశాల మేరకు రెంజల్ మండల కేంద్రంలో సీఐ శంకరయ్య మామ అడ్ల కోటయ్య పేరుపై ఉన్న 20 ఎకరాల పట్టాదారు పాసు బుక్కులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సేకరించారు. భూమిలో సాగుచేస్తున్న పంటలు, ఆ భూమి విలువ, ప్రభుత్వం అందించిన రైతుబంధు సాయం తదితర వివరాలను నమోదు చేసుకున్నారు. భూమి పూర్తి వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసుకున్నారు. సుదీర్ఘంగా కొనసాగిన విచారణ బయట పడకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. శంకరయ్య గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, ఎడపల్లి, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్‌లో ఎస్సైగా, బోధన్, కామారెడ్డి పట్టణాల్లో సీఐగా విధులు నిర్వహించారు.
