తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలుచేస్తున్న పారదర్శక విధానాలకుగాను ఈ అవార్డులు దక్కాయి. స్కోచ్ సంస్థ 66వ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించింది. టీఎస్ఎండీసీకి ఒకటి, ఐటీ శాఖకు రెండు అవార్డులు దక్కాయి. వీటిలో ఒకటి స్వర్ణం కాగా, రెండు రజతం ఉన్నాయి. డిజిటల్ ఇండియా క్యాటగిరీలో టీఎస్ఎండీసీకి గోల్డ్ అవార్డు దక్కింది. శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టంలో ఆన్లైన్లో ఇసుక విక్రయాలు చేపట్టి, పారదర్శక విధానాన్ని అమలుచేస్తున్నందుకు గోల్డ్ అవార్డును అందించారు. ఈ క్యాటగిరీలో 1000 దరఖాస్తులు రాగా టీఎస్ఎండీసీకి స్వర్ణం దక్కడం విశేషం.
