విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కూలీలు మృతి చెందారు. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది . క్రేన్ తనిఖీ చేస్తుండగా కుప్పకూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
క్రేన్ కింద ఉన్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. గాయపడ్డ మరి కొంతమందిని ఆస్పత్రికి తరలించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సంఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఘటనస్థలానికి చేరుకున్న బాధితుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.