రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులతో పాటు పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటుతున్నారు. హీరోయిన్ రష్మిక మందన ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి, తన పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులోని తన నివాసంలో హీరోయిన్ అశిక రంగనాథ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుంచి తాను ప్రతి ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటుతానని ప్రకటించింది. అదేవిధంగా తన అభిమానులు కూడా సైతం వారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
