రైతు నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు తాసిల్దార్ కార్యాలయం లో చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు..మండలంలోని సూగూర్ గ్రామ పరిధిలోని రామేశ్వరాపూర్ శివారులో ఉన్న 4.24 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఆర్వోఆర్లో నమోదు చేయాలని రైతు ఆడెం ఆంజనేయులు గ్రామ వీఆర్వో వెంకటరమణను కోరాడు. అయితే ఈరోజు.. రేపు అంటూ కార్యాలయం చుట్టూ రైతును తిప్పించుకొని చివరకు రూ.9 వేలు ఇస్తే నమోదు చేస్తానని వీఆర్వో డిమాండ్ చేశాడు. రూ.6 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రైతు నుంచి రూ.6 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్సైలు లింగస్వామి, ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
