విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టడంతో.. భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని మోదీకి జగన్‌ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానమంత్రికి సీఎం జగన్ తెలిపారు.