నల్లగొండ మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కో ఆప్షన్ ఎన్నికల్లో నాలుగుకు నాలుగు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను కమిషనర్ శరత్ చంద్ర ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికకు టీఆర్ఎస్ కు చెందిన 20 మున్సిపల్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర, ఒక ఎంఐఎం, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ హాజరయ్యారు.
వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ తెరా చిన్నపరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన సభ్యులు ఎన్నికకు దూరంగా ఉన్నారు. కో ఆప్షన్ సభ్యులుగా టీఆర్ఎస్ కు చెందిన కొండూరు సత్యనారాయణ, గున్ రెడ్డి రాధిక జనరల్ కోటాలో, జమాలుద్దీన్ ఖాద్రీ ముస్లిం కోటాలో, కంచర్ల తేజశ్రీ క్రిస్టియన్ కోటాలో బరిలో నిలిచారు.
వీరికి పోటీగా ఎవరు లేకపోవడంతో ఎన్నిక సజావుగా ముగిసింది. నిర్ణీత సమయం అనంతరం వీరు నలుగురు ఎన్నికైనట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యుల ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.