తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అందజేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేసి శాలువాతో రామానుజయ్యను సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దాశరథి పురస్కారం పొందడానికి రామానుజం వందకు వందశాతం అర్హుడని సీఎం అన్నారు. ఆయన రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ప్రజా ఆదరణ పొందాయన్నరు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితివేత్తగా రామానుజం నిలుస్తారని సీఎం కేసీఆర్ అభినందించారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పాడి వినిపించిన పద్యం అందరినీ ఆకట్టుకున్నది.
