
గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘పల్లె ప్రగతి’ రెండో విడుత కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి విడుత లో భాగంగా చేపట్టిన పనుల పురోగతి.. రెండో విడుతలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామసభల్లో తీర్మానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రా మంలో మంత్రి ఎర్రబెల్లి, మెదక్ జిల్లా కోనాయపల్లిలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చెంగల్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, వనపర్తి జిల్లా రేవల్లి మం డలం చెన్నారంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నిర్మల్ జిల్లా సిర్గాపూర్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని గుండ్లపొట్లపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో తెలంగాణ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్, నల్గొండ జిల్లాలో పంచాయతీరాజ్ కమిషనర్ నీతూకుమారి, వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలంలో రాష్ట్ర ప్రభుత్వ పరిశీలకులు హరిప్రీత్‌సింగ్, రంగారెడ్డి జిల్లా కందుకూరులో సహకార కమిషనర్ వీరబ్రహ్మయ్య, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఐజీ మల్లారెడ్డి తదితరులు రెండో విడుత పల్లెప్రగతిలో పాల్గొని గ్రామస్థులకు దిశానిర్దేశం చేశారు.