పెరుగుతున్న జనభా, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ లోని పీసీబీ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ నివారణ, బయో మెడికల్ వేస్టేజ్, నిర్మాణ, కూల్చివేతల, హానికర, ఇంధన వ్యర్థాల నిర్వహణ నిర్వీర్యం, ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులతో చర్చించారు. ప్రధానంగా కరోనా బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణపై మంత్రి ఆరా తీశారు.
దవాఖానల్లో జీవ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని పర్యవేక్షించాలన్నారు. నిరంతరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంత పరిమాణంలో జీవ వ్యర్థాలు పోగవుతున్నాయి? ఎక్కడి నిర్మూలన ప్లాంటుకు ఎన్ని తరలించారన్న సమాచారం ఎప్పటికప్పుడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తమ వెబ్ సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతిలో జీవ వ్యర్థాల నిర్వీర్య ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు.

బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించని హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో పారిశ్రామిక, జల, వాయు కాలుష్య నివారణకు నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. అన్ని రకాల కాలుష్య సమస్యలను అధిగమించేందుకు దీర్ఘకాలిక లక్ష్యంతో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత వుందన్నారు.
తమ ప్రాంతంలో ఉన్న వాయు నాణ్యత సూచికను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన టీఎస్ ఏయిర్ (TSAIR APP) ప్రత్యేక మొబైల్ యాప్ ను మంత్రి ఇంవిష్కరించారు. అండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే, ఐవోఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంకచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న రియల్ టైమ్ అంబియెంట్ వాయు నాణ్యత సూచిని తెలుసుకోవచ్చని పీసీబీ అధికారులు తెలిపారు. ఫొటోలను అప్ లోడ్ చేయడంతో పాటు ఫిర్యాదు కూడా చేయవచ్చని చెప్పారు.
సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, సీఈ విశ్వనాధం, జేసీఈ సీవై.నగేష్, జేసీఈఎస్ సత్యనారాయణ, జోనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.