ఏకాంతంగా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు : టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఈసారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్నాయి. కాగా అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో నిర్ణ‌యిస్తామ‌న్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. అనంత‌రం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా క‌శ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ దాత‌ల‌ నుండి విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. టీటీడీ ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఇక‌మీద‌ట న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తానికి గ‌డువు తీరేలా బ్యాంకుల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. 

బ‌ర్డ్ ఆసుప‌త్రిలో కీళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ. 5.4 కోట్లతో బ‌ర్డ్ ‌ప‌రిపాల‌న భ‌వ‌నం 3వ అంత‌స్తులో 50 ప్ర‌త్యేక గ‌దుల నిర్మాణానికి ఆమోదం తెలిపిన‌ట్లు చెప్పారు. పాత బ్లాక్‌లో చిన్న పిల్లల‌ ఆసుప‌త్రిని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ ర‌హ‌దారికి వాలు గోడ‌ల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ‌ఆమోదం తెలిపామ‌న్నారు. రాష్ట్రంలోని దేవాదాయ‌శాఖ‌, టీటీడీ, వివిధ ధార్మిక సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న వేద పాఠశాల‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తెచ్చి వేద విశ్వ విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో కామ‌న్ సిల‌బ‌స్ త‌యారుచేసి సంహిత (10వ త‌ర‌గ‌తి), మూలము (ఇంట‌ర్ మీడియేట్) ప‌రీక్ష‌లు నిర్వ‌హించి స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ స‌మ‌యంలో కూడా ప్రాణ‌ల‌కు తెగించి ప‌‌ని చేస్తున్న టీటీడీ ఉద్యోగుల‌కు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. క‌రోనా బారిన ప‌డిన టీటీడీ ఉద్యోగులు ప్రైవెట్ ‌ఆసుప‌త్రిలో వైద్యం చేయించుకుంటే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం బిల్లులు చెల్లించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. 

కోవిడ్ కార‌ణంగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ర‌ద్ధు చేయ‌డం వ‌ల‌న ఇప్ప‌టికే ఉద‌యా‌స్త‌మాన సేవ, వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని ప‌థ‌కాల టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు  ప్రొటోకాల్ విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో ‌ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కొర‌కు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌ను కొత్త టెక్నాల‌జితో అభివృద్ధి చేయ‌నున్న‌ట‌లు చెప్పారు. ఇందుకోసం టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యురాలు సుధా నారాయ‌ణ‌ మూర్తి కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించార‌న్నారు. బ‌యో డిగ్రేడ‌బుల్ త‌డి చెత్త నుండి వ‌చ్చే సేంద్రియ ఎరువును విక్ర‌యించ‌డానికి లైసెన్స్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. లాభం లేకుండా రైతుల‌కు ఈ ఎరువు అందిస్తామ‌న్నారు. ఈ స‌మావేశంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు డి.దామోద‌ర్‌రావు, డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌శాంతి,  మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, డా.నిశ్ఛిత‌ పాల్గొన్నారు.