పీవీ భారతరత్నం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానంచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో పీవీ స్మారకాన్ని నిర్మించాలని, నెక్లెస్‌రోడ్‌కు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరుపెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలకు భూమి మాత్రమే ఉత్పత్తి సాధనం, ఉపాధిమార్గమూ అయిన కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలుచేశారు. దీని ఫలితంగా నేడు తెలంగాణలో 93% మంది చిన్న, సన్నకారు రైతుల చేతుల్లోకి భూమి వచ్చింది. ఆయన ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే నేడు దేశం ఆర్థికంగా నిలదొక్కుకున్నది. 

అలాంటి గొప్పవ్యక్తిని అద్భుతమైన పద్ధతుల్లో స్మరించుకోవాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న ప్రస్తుత సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్దఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలను విభజించుకొని కార్యాచరణ రూపొందించాలని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు వికాస్‌రాజ్‌, శ్రీనివాస్‌రాజు, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు రమణాచారి, దేవులపల్లి ప్రభాకర్‌రావు, టంకశాల అశోక్‌, పీవీ ప్రభాకర్‌రావు, వాణిదేవి, కే రామచంద్రమూర్తి, మహేశ్‌ బిగాల, వైవీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. పీవీ రచించిన పుస్తకాలు, ఆయనపై ప్రచురితమైన పుస్తకాలను కుమార్తె వాణిదేవి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

  • నెక్లెస్‌ రోడ్‌ను పీవీ జ్ఞాన్‌మార్గ్‌గా అభివృద్ధి చేయాలి. ఆ మార్గమంతా అందమైన ఉద్యానవనాలు నిర్మించాలి. పీవీ విగ్రహం పెట్టాలి. 
  • పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాల్సిందిగా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సీఎం ఆదేశించారు. 
  • హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుచేయాలి. వివిధరంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా దీన్ని ఏర్పాటుచేయాలి. ఇందుకోసం అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. 
  • పీవీ పేరుమీద విద్యావైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసినవారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించాలి. అవార్డు కోసం నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 
  • పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ప్రపంచంలోని వివిధదేశాల్లో నిర్వహించాలి. ఇప్పటికే అమెరికా, సింగపూర్‌, సౌతాఫ్రికా, మలేషియా, మారిషస్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా దేశాల్లోనూ షెడ్యూల్‌ రూపొందించాలి.
  • ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పీవీకి వివిధదేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధా లు ఏర్పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటన్‌ మాజీ అధ్యక్షులు జాన్‌మేజర్‌, కామెరూన్‌ తదితరులను కూడా శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలి. 
  • శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులకు సీఎం కేసీఆర్‌ స్వయంగా లేఖలు రాస్తారు. 
  • ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో పీవీ విగ్రహం పెట్టాలి. ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు తదితర రాష్ర్టాలతో పీవీకి ఎక్కువ అనుబంధం, అక్కడి వారితో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి. 
  • అన్ని జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించాలి. 
  • అముద్రితాలుగా ఉన్న పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున ముద్రించాలి. పత్రికల్లో వచ్చిన వ్యాసాలతో ప్రత్యేక పుస్తకం తీసుకురావాలి. వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతులతో ప్రత్యేక పుస్తకం ముద్రించాలి. జీవిత విశేషాలతో కాఫీ టేబుల్‌ బుక్‌ తయారుచేయాలి. 
  • పీవీ జీవిత విశేషాలతో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించాలి. తెలంగాణ సంబురాల తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుత వంటకాలతో ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహించాలి. 
  • ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడానికి పీవీ విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి. 
  • పీవీ ఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. 

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. దేశంలో సంస్కరణలను అమలుచేసిన గొప్ప సంస్కర్త. ప్రపంచం గుర్తించిన మహామనిషి. అలాంటి మహోన్నతవ్యక్తి గొప్పతనాన్ని అసెంబ్లీలో చర్చిస్తాం. ఆయనకు భారతరత్న పురస్కారంఇవ్వాలని తీర్మానం చేస్తాం. అసెంబ్లీలో తైల వర్ణచిత్రం పెడతాం. పార్లమెంట్‌లోనూ పెట్టాలని కేంద్రాన్ని కోరతాం. సెంట్రల్‌ యూనివర్సిటీకి పీవీపేరు పెట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానంచేస్తాం.