ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు

ఢిల్లీలోని లోధి శ్మ‌శాన‌వాటిక‌లో మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. సైనిక లాంఛ‌నాల‌తో ప్ర‌ణ‌బ్ అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించారు. కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌ల‌ను ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ నిర్వ‌హించారు.  కొవిడ్ నేప‌థ్యంలో గ‌న్ క్యారేజ్ పై కాకుండా సాధార‌ణ అంబులెన్స్‌లో ప్ర‌ణ‌బ్ అంతిమ‌యాత్ర కొన‌సాగింది. 

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆగ‌స్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప్ర‌తిలో ప్ర‌ణ‌బ్ చేరిన విష‌యం విదిత‌మే. మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ఆయ‌న‌కు ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు స‌ర్జరీ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌బ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆగ‌స్టు 31న సాయంత్రం ప్ర‌ణ‌బ్ తుదిశ్వాస విడిచారు