తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలను ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనుంది. యూజీసీ మార్గదర్శకాలు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్షల నిర్వహణ చేపట్టినట్లు వర్సిటీ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ నసీమ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నియమితులైన ఎగ్జామ్స్ కంట్రోలర్ డాక్టర్ పాత నాగరాజు జూమ్ అప్లికేషన్ ద్వారా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించడానికి ఆదేశాలను విడుదల చేసిందన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్ష నిర్వహణ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని ప్రిన్సిపల్స్‌తో రిజిస్ట్రార్ అన్నారు.
35 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొదట థియరీ పరీక్షలు నిర్వహించి, ఆ తరువాత ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు తగ్గించామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు బ్యాక్‌లాగ్‌లు ఉంటే వాటిని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్స్‌ను, చీఫ్ ఎగ్జామినర్లను ఆమె కోరారు.