ఇఎస్‌ఐ స్కాంలో మరోసారి ఏసీబీ సోదాలు రూ.4 కోట్ల 47లక్షలు స్వాధీనం

ఇఎస్‌ఐ స్కామ్‌లో మంగళవారం ఏసీబీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించి దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4 కోట్ల 47 లక్షలు నగదును సీజ్ చేశారు. కూకట్‌పల్లిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు దేవికారాణి రూ. 3,75,30,000, నాగలక్ష్మి రూ.75,00,000 మొత్తాలను 15,000 ఎస్‌ఎఫ్‌టి స్థలంలో 6 ఫ్లాట్స్ కొనుగోలుకు ఓ బిల్డర్‌కు రూ. 4 కోట్ల 47 లక్షల నగదు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈక్రమంలో పక్కా సమాచారంతో బిల్డర్ దగ్గర నాలుగు కోట్ల రూపాయలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బిల్డర్ వద్ద దేవికా రాణి, నాలక్ష్మిలు బినామీ పేర్ల మీద నాలుగు కోట్ల నగదు దాచినట్లుగా ఏసీబీ అధికారులు ముందే గుర్తించారు. గతంలో ఇఎస్‌ఐ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలో రెసిడెన్షియల్ స్థలం కోసం బిల్డర్ దగ్గర దేవికారాణి డబ్బులు ఆన్‌లైన్‌తో పాటు వివిధ రకాలుగా డిపాజిట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా ఉండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. దేవికారాణి అవినీతి డబ్బుతో రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు స్కెచ్ వేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు డెవలపర్‌కు రూ. 4కోట్ల 47 లక్షలు ఇచ్చినట్లు గుర్తించినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు రియల్టర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా రియాల్టర్ ఆస్తులను అటాచ్ చేస్తామనే ఏసీబీ అధికారులు హెచ్చరించడంతో రూ. 4 కోట్ల 47 లక్షలు నగదును ఏసీబీ అధికారులకు తిరిగి ఇచ్చేశారు. కాగా ఏసీబీ విచారణలో నిందితులైన దేవికారాణి, నాగలక్ష్మి స్థిరాస్తి రంగంలో పెట్టుబడి కోసం వ్యాపారికి నగదు ఇచ్చినట్లు గుర్తించారు. ఈక్రమంలో స్థిరాస్తి వ్యాపారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.