అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న 130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మినీ గూడ్స్ వాహనాలను సీజ్ చేసి 18 మందిపై కేసులు నమోదు చేశారు. పెద్దఅడిశర్లపల్లి మండలం ఎర్రగుంటపల్లి తండా, వద్దిపట్ల, పెద్దవూర మండలం ఉట్లపల్లికి చెందిన రేషన్ డీలర్లు రమేశ్, విజయ్, వెంకట్‌రెడ్డి రేషన్ లబ్ధిదారుల నుంచి 130 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారు. 260 బస్తాల్లో వీటిని నింపి వాహనాల్లో తరలిస్తుండగా ఈ తెల్లవారుజూమున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మల్లేపల్లి పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తున్న దేవరకొండకు చెందిన నీలా రవి, కొండారెడ్డిపల్లికి చెందిన కరుణాకర్, తిమ్మాయిపల్లికి చెందిన శ్రీనులతోపాటు వాహన డ్రైవర్లు, హమాలీలు, రేషన్ డీలర్లతో కలిపి మొత్తం 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. బియ్యాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి తరలిస్తున్న గుర్తించామని సీఐ పరుశురాం తెలిపారు.