ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. వరుసగా 11 రోజుల పాటు 10వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది.
వైరస్ ప్రభావంతో తాజాగా 70 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,487కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,04,074 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 97,932 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం ఒకే రోజు 58,157 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 41,66,077 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.