తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన ప్రారంభమైంది. అవినీతికి ఆస్కారంలేని నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నవేళ ప్రభుత్వం పలు విధాన నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితోపాటు భూ లావాదేవీల్లో కోర్ బ్యాంకింగ్ తరహా వ్యవస్థను అమలుచేసేలా ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్- 2020’ని ఆమోదించింది. ప్రగతిభవన్‌లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. భూ పరిపాలనలో క్షేత్రస్థాయిలో అవినీతి ఊడలు దిగింది. భూరికార్డుల నిర్వహణ చేతిలో ఉన్న వీఆర్వోలు కొంతమంది తమ చేతివాటం చూపించడంతో రెవెన్యూశాఖకు అవినీతి మరకలు అంటాయి. వీఆర్వో వ్యవస్థ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. దీంతో భూ రికార్డుల నిర్వహణతోపాటు, భూ లావాదేవీల వ్యవహారాన్నంతా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. భూ లావాదేవీల్లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను అమలుచేసేలా ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్-2020’కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
వీఆర్వోల నుంచి రికార్డుల స్వాధీనం
నూతన రెవెన్యూ చట్టాలు తేనున్న నేపథ్యంలో అంతకుముందే గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) దగ్గరున్న రికార్డులన్నింటినీ స్వాధీనంచేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేశారు. వీఆర్వోల వద్ద ఉన్న అన్నిరకాల రికార్డుల ఒరిజినల్, జిరాక్సు, ప్రింటెడ్ కాపీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోగా సేకరించాలని, సాయంత్రం 4.30 గంటలలోగా నివేదికలను కలెక్టర్లకు అందజేయాలని తాసిల్దార్లను సీఎస్ ఆదేశించారు. పహాణీలు, పీవోటీలు, టిప్పన్లు, గ్రామపటాలు వంటివాటిని సేకరించి భద్రపర్చాలని స్పష్టంచేశారు. అనంతరం రికార్డులను తీసుకున్నట్టు తాసిల్దార్లు ధ్రువపత్రం జారీచేయాలన్నారు. అదేసమయంలో తమ వద్ద ఉన్న అన్ని పత్రాలను సమర్పించినట్టు సంబంధిత వీఆర్వోలు ‘నిల్ డిక్లరేషన్’ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఫార్మాట్‌ను విడుదలచేశారు. ఒకవేళ ఏదేని రెవెన్యూ అధికారి వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేకుంటే నిల్ డిక్లరేషన్‌లో ఆ విషయాన్ని నమోదుచేయాలని స్పష్టంచేశారు. ఈ ధ్రువపత్రాలలో ఒక కాపీని ఆర్డీవోల ద్వారా కలెక్టర్లకు అందజేయాలని చెప్పారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తిచేసేందుకు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు వంటి సీనియర్ అధికారులను మండలాలకు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. రికార్డుల అప్పగింత లేదా సేకరణలో వీఆర్వోలు, తాసిల్దార్లు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కఠినచర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు తమ వద్ద ఉన్న అన్ని రకాలా పత్రాలను తాసిల్దార్లకు అప్పగించారు.
ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు
ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో పౌరులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక మార్పులు తీసుకొస్తున్నామని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం పేర్కొంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టం 1908, రూల్ 5 ప్రకారం సెప్టెంబరు 8 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రిజిస్ట్రార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విల్ డీడ్ (వీలునామా), వివాహాల నిర్వహణ, ఫ్రాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని, మళ్లీ చెప్పే వరకు రిజిస్ట్రేషన్లు మాత్రం చేయొద్దని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపులు, ఈ-చలాన్ విక్రయాలను నిలిపివేశారు. గతంలో స్టాంపులు కొనుగోలు చేసిన, చలాన్లు చెల్లించినవారికి మాత్రమే సోమవారం రిజిస్ట్రేషన్లు చేశారు. కరోనా దెబ్బకు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇప్పటికే భారీగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్లు సాధించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.1461 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సెలవులు ప్రకటించడంతో ఆదాయం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కంటే మరేది ముఖ్యం కాదనే ఉద్దేశంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం అవుతున్నది.