మెడికల్ షాపు అనుమతి కోసం దరఖాస్తుదారున్ని లంచం డిమాండ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ డిపార్టుమెంట్ జూనియర్ అసిస్టెంట్, అతని సబార్డినేట్ రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దాడుల వివరాలిలా ఉన్నా యి. హుజూరాబాద్‌కు చెందిన దాసి రవీందర్ మెడికల్ షాపు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి లైసెన్స్ జారీ చేసేందుకు డ్రగ్స్ కంట్రోల్ శాఖ జూనియర్ అసిస్టెంట్ వినాయక్‌రెడ్డి రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వనిదే లైసెన్స్ జారీ కాదని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వ్యూహ రచన చేశారు. సోమవారం చైతన్యపురిలో దాసి రవీందర్ నుంచి డ్రగ్ కంట్రోల్ శా ఖ జూనియర్ అసిస్టెంట్ వినాయక్‌రెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులిచ్చేందుకు వచ్చిన దరఖాస్తుదారుడిని వినాయక్‌రెడ్డి వద్దకు పంపించేందుకు అతడి సబార్డినేట్ రూ.500 లంచంగా తీసుకొన్నాడు. అదే సమయంలో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు వినాయక్‌రెడ్డిని, అతని సబార్డినేట్ మహ్మద్ రిజ్వాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రసాయనిక పరీక్షలు నిర్వహించడంతో లంచం తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అవినీతి నిరోధకశాఖ కార్యాలయానికి తరలించి విచారించారు. విచారణ అనంతరం నిందితులిద్దరిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
