కరోనా పేర్రేపిత లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి దశలవారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ సీహెచ్.గోపాల్‌రెడ్డి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కోర్సుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ఓయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీసీఏ, బీఈడీ, ఎల్ఎల్బీ-3, 5వైడీసీ, ఎల్ఎల్ఎం, బీపీఈడీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి డిగ్రీలోని బీఎస్సీ, బీఏ, బీకాం, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ పరీక్షలకు ఈ నెల 14వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ సూచించింది.
ఆలస్య రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. కరోనా జాగ్రత్తలతో యూసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో చివరి ఏడాదిలో 1.10 లక్షల మంది విద్యార్థులుండగా.. 65 వేల మంది డిగ్రీ కోర్సులు, 20 వేల మంది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. మరో 25వేల మంది పీజీ కోర్సులు చేస్తున్నారు. ఈ సారి విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్షలు నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. కళాశాలలో విద్యార్థుల సంఖ్య వంద దాటితే అదే కళాశాలలో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. అదే 50-60 మంది విద్యార్థులుంటే రెండు, మూడు కళాశాలలను కలిపి ఒక కేంద్రంగా ఎంపిక చేస్తున్నారు. తొలిసారిగా డిగ్రీ పరీక్షల్లో ఆన్లైన్ ద్వారా విద్యార్థుల హాజరును తీసుకోనున్నారు. ప్రస్తుతం హాజరు కాలేని విద్యార్థులకు రెండు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు.