జహీరాబాద్‌లోభారీగా గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న గంజాయి రవాణాపై పక్కాగా నిఘా పెట్టామని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి అన్నారు. ఆదివారం జహీరాబాద్‌ శివారులోని బీదర్‌ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా గంజాయిని తరలిస్తున్న లారీ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కా సమాచారంతో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ గాయత్రి, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో స్థానిక పరివార్‌ దాబా ఎదుట పార్కింగ్‌ స్థలంలో నిలిచి ఉన్న ఎంహెచ్‌ 12 ఎల్‌టీ 9727 లారీని తనిఖీ చేయగా, అందులో ఉన్న బొగ్గు కింద ఎండు గంజాయి బయటపడిందన్నారు. లారీ క్యాబిన్‌ వెనుక బొగ్గును తవ్వగా 25 ప్లాస్టిక్‌ సంచుల్లో 300 ప్యాకెట్లలో 2 కిలోల చొప్పున మొత్తం 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఎక్సైజ్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయట పడిందని కమిషనర్‌ వెల్లడించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని, వీరికి తోడుగా ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందన్నారు. లారీలో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి జహీరాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించామన్నారు. లారీ విలువు రూ.20 లక్షలు ఉంటుందని, లారీలో రవాణా చేస్తున్న 25 టన్నుల బొగ్గు విలువను గుర్తించి వేలంపాట వేసి లెక్క కడతామని అన్నారు. అక్రమ మార్గంలో గంజాయి రవాణా చేస్తూ సంపాదించేందుకు వ్యాపారులు ఆంధ్రా, ఒరిస్సా రాష్ర్టాల సరిహద్దులు విశాఖ పట్టణం జిల్లా నుంచి మహారాష్ట్రలోని లాతూర్‌కు రవాణా చేస్తున్నారన్నారు. ఈ రవాణా చేసే వారి వెనుక ఎవ్వరున్నా విడిచిపెట్టేది లేదని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ స్పష్టం చేశారు. పటిష్టమైన నిఘా, పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.