తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,58,153కు చేరింది. తాజాగా మరో 2,479 మంది కోలుకోగా.. 1,27,007 మంది ఇండ్లకు చేరుకున్నారని చెప్పింది. వైరస్‌ ప్రభావంతో మరో 13 మంది మృత్యువాతపడగా.. ఇప్పటి వరకు 974 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.1శాతంగా ఉందని వివరించింది. 26,639 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. ఆదివారం 34,427 నమూనాలు పరిశీలించగా, మొత్తం 21,69,339 టెస్టులు చేసినట్లు తెలిపింది. ఇంకా 825 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 264, రంగారెడ్డిలో 133, కరీంనగర్‌లో 108, సంగారెడ్డి 107 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.