తెలంగాణ శాస‌న‌స‌భలో ప‌లు బిల్లుల‌కు ఆమోదం..

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ప‌లు బిల్లుల‌కు స‌భ ఆమోదం తెలిపిన అనంత‌రం స‌భ‌ను రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌లు, కారుణ్య నియామ‌కాల‌పై స‌భ్యులు లేవ‌నెత్తిన అంశాల‌పై సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తామ‌ని, కారుణ్య నియామ‌కాల‌ను అర్హ‌త‌ల‌ను బ‌ట్టి భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. అనంత‌రం జీరో అవ‌ర కొన‌సాగింది. ఆ త‌ర్వాత ప‌లు బిల్లుల‌పై స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఆయా శాఖ‌ల మంత్రులు బిల్లుల‌పై వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది.

ఆమోదం పొందిన బిల్లులు..

1. ప్ర‌భుత్వ నియామ‌కాల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌యోప‌రిమితి చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు 

2. విప‌త్క‌ర వేళ ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల్లో కోత బిల్లు 

3. ఆర్థిక బాధ్య‌త‌,  బ‌డ్జెట్ నిర్వ‌హ‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు 

4. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు, స్వీయ ధృవీక‌ర‌ణ బిల్లు(టీఎస్ బీపాస్)

5. ప్రైవేటు యూనివ‌ర్సిటీల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు 

6. సివిల్ కోర్టుల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు

7. జీఎస్టీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు

8. కోర్టు ఫీజులు, సూట్స్ వ్యాలుయేష‌న్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు