శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. ఉత్సవాలు శనివారం నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఉత్సవాల అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా విశ్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో కార్యక్రమం అత్యంత ముఖ్యమైంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది. శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.
