తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఈ క్రమంలో కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులంతా హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
