చర్లపల్లి జైలును సందర్శించిన హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ చంద్రయ్య

చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘం చైర్‌పర్సన్‌, జస్టిస్‌ చంద్రయ్య, సభ్యుడు ఆనంద్‌రావు శనివారం సందర్శించారు. కారాగారంలోని సంజీవని వైద్యశాలను పరిశీలించి ఖైదీలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను సందర్శించి ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం ప్రొఫెసర్‌ సీ.బీనా ఆధ్వర్యంలో ఖైదీలకు కల్పించిన ఎంఎస్సీ సైకాలజీ ల్యాబ్‌ను సందర్శించి వారి చదువు, జైలు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను తెలుసుకున్నారు. టైలరింగ్‌ యూనిట్‌, శానిటైజర్‌, స్టీల్‌ పరిశ్రమలను సందర్శించారు. 

కేంద్ర కారాగారంలో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ ఎంఆర్‌.భాస్కర్‌ వారికి వివరించారు. అనంతరం జైలు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఖైదీలకు పలు సూచనలు చేశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జైలు సూపరింటిండెంట్‌ సంపత్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణమూర్తి, వెంకటేశం, జైలర్లు మొగిలేశ్‌, దేవిసింగ్‌, జ్యోతీశ్వర్‌రెడ్డి, పరశురాములు, డిప్యూటీ జైలర్లు కృష్ణ, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.