ఏపీలో రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వైఎస్‌ రైతుభరోసా నగదు, పీఎం కిసాన్‌ మూడో విడుత నిధులతోపాటు నివర్‌ తుపాన్‌ పంట నష్టాన్ని అర్హులైన రైతుల బ్యాంకుఖాతాల్లో మంగళవారం  జమచేసింది. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లు  మొత్తం రూ.1,766 కోట్లు చెల్లిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా ఆయన నగదు బదిలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. గత ప్రభుత్వం రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసగించిందని ఆక్షేపించింది. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం పెట్టిన ప్రతి బకాయిని చెల్లించినట్లు చెప్పారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని తెలిపారు.