నాలుగో విడతలో 2,744 పంచాయతీలకు ఎన్నికలు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్‌ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. నాలుగో విడత మొత్తం 3, 299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 553 సర్పంచ్‌ స్థానాలు, 10,921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈ నెల 21న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. సర్పంచి స్థానాలకు 7475 మంది, వార్డులకు 49,089 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికలు సజావుగా జరిగాయని, ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.