న్యాయవాదులైన గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి దంపతులను నడిరోడ్డుపై పట్టపగలే అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం విదితమే. ఈ దంపతులపై దాడి జరిగిన క్రైమ్ ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయలేదు అనేది పూర్తిగా అవాస్తవమని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. రామగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని కల్వచర్ల వద్ద వామన్‌రావు, నాగమణి ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వ్యక్తులు ఆపి, వారిని కత్తులతో నరికి చంపారు. ఈ క్రమంలో రామగిరి ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను క్రైమ్ ప్రదేశానికి పంపి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మంథని సీఐ మహేందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ను క్రైమ్ ప్రదేశం ఇంచార్జిగా ఉంచి, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించాలని ఆదేశించినట్లు సీపీ తెలిపారు. మొత్తంగా అక్కడ ఒక సీఐ, ఎస్ఐ, స్పెషల్ పార్టీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
