తెలంగాణలో కొత్తగా 1,321 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో ఐదుగురు మహమ్మారి ప్రభావంతో మృతి చెందారు. 293 మంది కోలుకొని హాస్పిటళ్ల నుంచి ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,923 కొవిడ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 3,866 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 320 కేసులున్నాయి.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,140కి చేరగా.. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 1,717 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంస్‌సీతో పాటు జిల్లాలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 320 కేసులు ఉండగా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 144, రంగారెడ్డిలో 121, నిజామాబాద్‌లో 96, నిర్మల్‌లో 64, సంగారెడ్డిలో 49, జగిత్యాలలో 46, కరీంనగర్‌లో 41, రాజన్న సిరిసిల్లలో 35, మహబూబ్‌నగర్‌లో 30 కేసులు రికార్డయ్యాయి.