ఏసీబీ అధికారులకి చిక్కిన మేడపల్లి వీఆర్వో

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో ఓ వీఆర్వో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మి మంజూరు కోసం లంచం తీసుకుంటూ రెండ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేడపల్లి గ్రామానికి చెందిన దేవరాజు యాకాంబ్రం-పద్మ వృత్తిరీత్యా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో నివాసముంటున్నారు. కాగా, వీరి కుమార్తె మౌనికకు జనవరిలో వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మి పథకం మంజూరు కోసం మేడపల్లి వీఆర్వో మెదరబోయిన అయిలయ్యను యాకాంబ్రం ఆశ్రయించాడు.

దీంతో వీఆర్వో రూ. ఐదువేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వాలని నిత్యం వీఆర్వో వేధిస్తుండగా ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం ఉదయం రాజుపేటలోని తన నివాసంలో వీఆర్వోకు యాకాంబ్రం రూ. మూడువేలు ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో అయిలయ్యపై ఏసీబీ అధికారులు నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణ చేశారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు క్రాంతికుమార్‌, శ్రీనివాస్‌, శ్యాంసుందర్‌ సిబ్బంది పాల్గొన్నారు.