* సీనియార్టీ లిస్ట్ ను పట్టించుకోకుండానే ప్రమోషన్లు ఇస్తున్న తెలంగాణ పిసిబి అధికారులు
* రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తెలంగాణ పిసిబికి వర్తించదా..?
* కోర్టులో కేసులుండగానే అనర్హులకు ప్రమోషన్లు ఎలా ఇస్తారు..?
* అర్హులైన అధికారులకు అన్యాయం చేస్తున్న పిసిబి అధికారులెవరు..?
* తెలంగాణ పిసిబికి సమాచార హక్కు చట్టం వర్తించదా..?
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిపిసిబి)లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా జూనియర్లను అందలం ఎక్కించడంతో పాటు సీనియర్ ఉద్యోగులకు రిజర్వేషన్లు వర్తించకుండా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1998, 2007 సంవత్సరంలో పీసీబిలో రిక్రూట్ మెంట్ అయిన ఉద్యోగులకు 1992లో సూచించిన రోస్టర్ ఆధారంగా రిజర్వేషన్లను వర్తింపచేసి పదోన్నతులు కల్పించాలనినిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నిబంధనలను ఉద్యోగులకు వర్తింప చేయకుండా పిసిబి కార్యాలయంలోని కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని పలువురు తెలంగాణ పిసిబి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు నచ్చిన ఉద్యోగులు జూనియర్లయినప్పటికీ.. వారిని అందలం ఎక్కించడంలో కొందరు పీసీబీ అధికారులు కీలకంగా పని చేస్తున్నారని పలువురు పిసిబి ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణ పిసిబిలోని ఈ ప్రమోషన్ల ప్రక్రియలో ప్రధానంగా టెక్నికల్ మరియు సైంటిఫిక్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ రెండు విభాగాలకు (టెక్నికల్, సైంటిఫిక్) చెందిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ప్రస్తుతం సీనియార్టీకి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తుండగానే పీసీబీ అధికారులు సీనియార్టీ జాబితాకు సంబంధించి ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే పదోన్నతులు కట్టబెట్టినట్లుగా తెలిసింది. ఈ ప్రమోషన్ల వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో పనిచేసే పలువురు అధికారులు అన్నీతామై వ్యవహరిస్తూ, మిగతా ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులను కూడా తప్పుదారి పట్టించడంలో ఈ అధికారులది అందేవేసిన చేయిగా పలువురు పిసిబి అధికారులే చెబుతున్నారు.
ఇప్పటికే సైంటిఫిక్ విభాగానికి సంబంధించి సీనియార్టీ జాబితాలోని కింది వరుసలో ఉన్న ఓ వ్యక్తికి అర్హత లేకున్నా పదోన్నతి ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఉద్యోగులు పదోన్నతుల జాబితాలో ముందు వరసలో ఉన్నా.. వారిని పట్టించుకోకుండానే సీనియార్టీ జాబితాను రూపొందించడం. వెంటనే అనర్హులకు పదోన్నతులు కల్పించడంపై పలువురు పిసిబి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఉద్యోగులు ఇదేమని అడిగితే వారికి ప్రస్తుతం రిజర్వేషన్లు వర్తించవని చెప్పడంతో పాటు ఉన్న తాధికారులను తప్పుదోవ పట్టిస్తూ అర్హులకు పదోన్నతులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు పిసిబి అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే ఈ రెండు విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇదే విషయాన్ని పీసీబీ మెంబర్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయినా కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగానే అనర్హులకు పదోన్నతులు కల్పించారని పలువురు పిసిబి ఉద్యోగులు తమ అవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పిసిబి మెంబర్ సెక్రటరీ, చైర్మన్ ను సైతం కొందరు పిసిబి అధికారులు తప్పుదోవ పట్టించి జూనియర్లకు పదోన్నతులు కల్పించినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ ప్రమోషన్ల వల్ల తాము నష్టపోతున్నామని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమోషన్లు ఇచ్చిన సందర్భంలో పీసీబీ బోర్డులో ఐఏఎస్ అధికారులతో పాటు ఐఎఫ్ఎస్ అధికారులు ఉండేవారని వారు రూల్స్ ప్రకారం తమకు ప్రమోషన్లు కల్పించారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బోర్డులో రూల్స్ తెలియని వారు ఉండటం వల్లే తమకు ఇలాంటి పరిస్థితి ఎదురయిందని పిసిబిలోని ఆయా విభాగాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు అదే విధంగా పిసిబిలోని సైంటిస్ట్ విభాగంలో 2007లో చేరిన ఉద్యోగులకు గ్రేడ్-1 (అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్) గా 2011 లోపదోన్నతి లభించింది. వారికి రెండో పదోన్నతి (2017లో ఎన్వీరాన్ మెంట్ సైంటిస్ట్)గా మరో ప్రమోషన్ రావాల్సి ఉండగా ఆ పోస్టులను వేరే వారికి కట్టబెట్టడానికి సిద్ధమైనట్లుగా తెలిసింది. ఇప్పటికే ఫిబ్రవరి 2021లో రిజర్వేషన్ల రోస్టర్ ను పట్టించుకోకుండా అనర్హులకు ప్రమోషన్లను ఇస్తూ అందలమెక్కిస్తున్నారన్న విషయాన్ని పిసిబిలోని ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమకు రిజర్వేషన్వర్తింప చేయాలన్న రూల్స్ ను పక్కన పెట్టి జూనియర్లకుఎలా పదోన్నతులు కల్పిస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో చోట్ల ఫిర్యాదు చేసినా తమకు సరైన న్యాయం జరగడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
ఈ ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల విషయంలో జరుగుతున్న అకకతవకలపై పూర్తి వివరాలు సేకరించడానికి ఓ పర్యావరణ వేత్త పిసిబి ప్రధాన కార్యాలయంలోని అధికారులకు ఆర్.టి.ఏ. కింద అప్లై చేయగా 2 నెలల సమయం తీసుకుని అడిగిన సమాచారంను పూర్తిగా ఇవ్వకుండా వారి సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ సమాచార హక్కు చట్టాన్ని కూడా పక్కదారి పట్టిస్తూ వారికి నచ్చిన విధంగా సమాచారాన్ని ఓ 6 పేజీల రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిపై ఆ పర్యావరణ వేత్త స్పందిస్తూ పిసిబి అధికారులకు సమాచార హక్కు చట్టం వర్తించదా..? పిసిబిలో పూర్తిస్ధాయి అప్పిలేట్ అధికారి ఎందుకు లేడు..? ఉన్న ఇంచార్జ్ అధికారి చేస్తున్నదేంటో కూడా తెలవడం లేదని ఆ పర్యావరణ వేత్త తెలిపారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగుల ప్రమోషన్లలో జరుగుతున్న అవకతవకలపై ఓ పర్యావరణ వేత్తగా అన్యాయం జరుగుతున్న ఉద్యోగుల తరుపున పోరాటం చేయడమే కాకుండా.. దీనిపై త్వరలోనే ఆర్.టి.ఏ. కమిషన్ కు వెళ్లి పిసిబి నుండి ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు సంబంధించిన పూర్తి సమాచాారాన్ని ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరుతానన్నారు.
ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై పూర్తి సమాచారం, ఆధారాలతో సహా త్వరలో మీ ముందుకు తెస్తుంది మీ ‘‘నిఘానేత్రం న్యూస్’’.