ఆర్థిక‌సాయానికి బాధిత జ‌ర్న‌లిస్టు కుటుంబాలు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

క‌రోనాతో మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టు కుటుంబ స‌భ్యుల‌కు రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం అందించ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఈ ఆర్థిక‌సాయం పొందేందుకు బాధిత కుటుంబాలు ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. అదేవిధంగా కొవిడ్-19తో మరణించిన జ‌ర్న‌లిస్టు కుటుంబాలకు గతంలో మాదిరిగానే 5 ఏళ్లపాటు నెలకు రూ. 3 వేలు పెన్షన్ అంద‌జేయనున్న‌ట్లు తెలిపారు. అంతేగాక మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి రూ. వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందిస్తామన్నారు.

కొవిడ్-19తో మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు దరఖాస్తుతో పాటు అక్రిడేష‌న్ కార్డు, ఐడి కార్డు, ఆధార్ కార్డు, రెండు లక్షల లోపు ఆదాయ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్, బ్యాంకు పాసు పుస్తకము, మూడు ఫోటోలు, జిల్లా వైద్యాధికారిచే కొవిడ్-19 మరణ ధృవీకరణ పత్రం జతచేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా గాని, పోస్ట్ ద్వారా గాని ఈ నెల 25వ తేదీ వరకు పంపించాలన్నారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాదుకు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు 7702526489 ఈ ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి సంప్రదించగలరని పేర్కొన్నారు.