తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాలవారీగా భూముల విలువ పెరిగినట్లుగా సమాచారం.