భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు అటాచ్‌

నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని డిండి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శోభన్‌బాబు, నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని పెద్దవూర ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న సైదాబాబు కొంతకాలంగా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై అంతర్గత విచారణ నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు ఎస్పీ రంగనాథ్‌కు నివేదిక ఇవ్వడంతో ఆయన ఈ ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. పోలీసు శాఖ క్రమశిక్షణకు పెట్టింది పేరని, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.