పర్యావరణం, అటవీ సంరక్షణే ధ్యేయం : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అట‌వీ, వన్యప్రాణుల సంర‌క్షణ‌, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అట‌వీ శాఖ‌ అధికారులను ఆదేశించారు. అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌ అధ్యక్షతన మంగళవారం అర‌ణ్య భ‌వ‌న్‌లో రాష్ట్ర వన్యప్రాణి మండలి స‌మావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశంలో అభయారణ్యాల్లో రహదారుల నిర్మాణాలు, వన్యప్రాణుల ఆవాసాలుకు అడ్డు రాకుండా స్వేచ్ఛగా సంచ‌రించేందుకు అండ‌ర్ పాస్‌ల ఏర్పాటుపై రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, బోర్డు సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే కోనప్ప‌, ఆసిఫాబాద్ జిల్లా జ‌డ్పీ చైర్ ప‌ర్సన్‌ కోవా ల‌క్ష్మి, ఇత‌ర బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..గిరిజన ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ క‌ల్పనకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరితగతిన ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టేలా అట‌వీ శాఖ అధికారులు, ఇత‌ర శాఖల స‌మన్వయంతో వెంట‌నే అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలు కూడా వెంట‌నే ప‌రిష్కరించేలా కృషి చేయాలన్నారు. అడ‌వుల ర‌క్షణ‌, వన్యప్రాణుల సంరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నార‌ని, దీంతో వన్య ప్రాణుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు. హ‌రిత‌హారంతో తెలంగాణ అంత‌టా ప‌చ్చదనం ప‌రుచుకుంద‌ని తెలిపారు.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో నిర్వహించే అఖిల భార‌త‌ పులుల గ‌ణ‌నకు అధికారులు స‌న్నద్ధంగా ఉండాలని, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల స‌హకారం తీసుకోవాల‌న్నారు. అంత‌కుముందు రాష్ట్ర వ‌న్యప్రాణి బోర్డు గ‌తంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని గురించి పీసీసీఎఫ్ ఆర్. శోభ పవ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ద్వారా మండ‌లి స‌భ్యుల‌కు వివరించారు.

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స‌భ్యుల సూచ‌ల‌కు స్పందించిన మంత్రి..దీనిపై ప్రత్యేక క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని, స‌మ‌గ్ర అధ్యయ‌నం చేసి బోర్డుకు ప్రతిపాదనలు స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.